స్థానిక సంస్థల్లో మహిళలకు అధికారం ఇంకా పేరుకే పరిమితమవుతోంది. పాలనా వ్యవహారాల్లో ఆమె కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవద్దని ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరించినా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. అభ్యంతరం చెప్పాల్సిన అధికారులు కూడా ఆమెకు బదులు.. ఆయనకే కుర్చీ వేస్తున్నారు. తరచూ ఏదో ఓ చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు గ్రామ పంచాయతీ సమావేశంలో మళ్లీ అలాంటి సీన్లే కనిపించాయి. మహిళా ప్రజా ప్రతినిధులకు బదులు వారి భర్తలు, కొడుకులు అధికార దర్పాన్ని ప్రదర్శించారు.
కొందుర్గు గ్రామానికి సర్పంచ్.. కావలి ఆదిలక్ష్మి కాగా ఆమె భర్త కాలే యాదయ్య సమావేశానికి హాజరయ్యారు. ఇక వార్డు సభ్యులేతే మాత్రం తాము తక్కువ తిన్నామా అన్నట్టుగా.. ఓవార్డుకు సంబంధించి సభ్యురాలి భర్త హాజరవ్వగా.. మరో వార్డుకు సంబంధించిన ఆమె కుమారుడు దర్జాగా వచ్చి కూర్చున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. మహిళతో కాకుండా వారింటి మగవారితో సమావేశాన్ని నిర్వహించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి .. అధికారిణి కావడం విశేషం.
ఓ మహిళా అధికారి అయ్యి ఉండి కూడా.. మహిళలకు బదులుగా మగవారు వస్తే ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా సమావేశం నిర్వహించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తే అధికారులపై చర్యలుంటాయని తెలిసినా.. ఆమె కూడా అవన్ని పట్టించుకోకపోవడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహిళా ప్రజాప్రతినిధులపై, అలాగే పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.