హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో ఓ ఇంట్లో ఇద్దరు పిల్లలతో సహా దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందా నగర్ లోని రాజీవ్ గృహకల్పలో బ్లాక్ నెంబర్ 18లో గత ఏడు సంవత్సరాలుగా నాగరాజు దంపతులు నివాసం ఉంటున్నారు. గత శుక్రవారం నుంచి వారు ఇంటి నుంచి బయటకు రాలేదు. ఈ రోజు ఉదయం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు వారి ఇంటి తలుపు కొట్టారు.
ఎంత కొట్టినా తలుపు తెరవకపోవడంతో వారు తలుపులు పగులగొట్టి చూడగా నలుగురు విగతజీవులుగా పడి ఉన్నారు. మృతులు నాగరాజు ఆయన భార్య సుజాత పిల్లలు రమ్యశ్రీ, టిల్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకు కారణంగా తెలుస్తుంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆత్మహత్యకు కారణాలపై విచారణ చేస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అలాగే నాగరాజు, సుజాత బంధువులకు సమాచారం అందించారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.