కేరళలో వెలుగుచూసిన యువతి నరబలి ఘటన మరువకముందే.. ఇదే తరహాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఈ దారుణమైన ఘటన గుజరాత్ లోని సోమనాథ్ జిల్లాలో వెలుగు చూసింది. అభం శుభం తెలియని ఓ బాలికను నరబలి ఇచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
వివరాల్లోకి వెళ్తే.. సోమనాథ్ జిల్లా ధావాగిర్ లో గుర్తు తెలియని బాలిక మృతదేహం పడిఉంది. ఆ శవం చుట్టూ పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉన్నాయి. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపించారు. అక్కడ లభ్యమైన ఆధారాలను బట్టి ఆ బాలికను నరబలి ఇచ్చారా లేదా అన్న విషయంపై విచారణ చేపడుతున్నారు.
అయితే బాలిక మృతిపై ఇంతవరకు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో బాలిక తండ్రితో పాటు మరో నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక తండ్రిని విచారించగా సరిగ్గా సమాధానాలు చెప్పలేదు.
దీంతో పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఘటనాస్థలిలో దొరికిన అన్ని ఆధారాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. నివేదిక వచ్చిన తర్వాత మొత్తం వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు పోలీసులు.