ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల శనివారం తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నారు. బంజారాహిల్స్‌లోని తన ఫ్లాట్ బాత్రూంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 30 మంది ఫ్యాషన్ డిజైనర్ల జాబితాలో ప్రత్యూష ఒకరు. ఆమె శనివారం తన ఫ్లాట్‌లోని బాత్రూంలో శవమై పడి ఉన్నారు. ఆమె పక్కనే కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బహుశా స్టీంలో కార్బన్ మోనాక్సైడ్ కలిపి దానిని పీల్చి ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసులు దీనిని అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ప్రాథమిక విచారణలో ఆమె డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పేర్కొన్నారు. టాలీవుడ్లో ప్రత్యూషకు మంచి పేరు ఉంది. ఆమె ప్రతిభకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఎందరో స్టార్ హీరో, హీరోయిన్లకు ఈమె డెస్సులను డిజైన్ చేశారు. ప్రత్యూష ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఈమె మృతిపై పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.