రాష్ట్ర రాజకీయాలలో ఒకనాడు హీరోలుగా ప్రజల ముందు చెలామణి అయిన నాయకులు నేడు జీరోలుగా మారి చెల్లకుండా పోయారు. అదేమిటి అని ఆశ్చర్యపోతున్నారా.. కానీ ఇది నిజం. తెలుగుదేశం, కాంగ్రెస్‌లను వీడి టీఆర్ఎస్‌లో చేరిన నాయకుల పరిస్థితి నూటికి నూరుపాళ్లు అలాగే ఉంది.నాడు పులులుగా వ్యవహరించి అధిష్టానం దగ్గర పని చేయించుకున్న నాయకులు, నేడు కేసీఆర్ దగ్గర పిల్లులుగా ఉంటున్నారు.ఒకనాడు వారు అధినాయకుడిని ఎప్పుడంటే అప్పుడు వెళ్లి కలిసేవారు కానీ నేడు కేసీఆర్‌ను కలవాలంటే నెలల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి.నాడు ఆత్మగౌరవంతో ప్రజల ముందు తలెత్తుకొని తిరిగితే నేడు ఆత్మ వంచనతో బతకాల్సిన పరిస్థితి.ఇది ఎవరికీ చెప్పుకోలేక తమ ముఖ్య అనుచరుల దగ్గర చెప్పుకొని బాధపడుతున్నారు. కేసీఆర్‌కు తెలిస్తే ఎక్కడ తమను కట్ చేస్తారోనని భయపడిపోతున్నారు. అందుకే నాలుగు గోడల మధ్య కుమిలిపోతున్నారు.నాడు అధిష్ఠానం దగ్గర వారు చెప్పిందే వేదంగా సాగించుకున్నారు.తమ జిల్లాలలో తమదే పెత్తనం అన్నట్లుగా వారు వ్యవహరించారు కానీ నేడు ఆ పరిస్థితి లేదు. నియోజకవర్గాలలో కేసీఆర్ తోపాటు కేటీఆర్, కవిత, సంతోష్, హరీష్ రావులు ప్రోత్సహించే నాయకులు ఉండడంతో తలలు పట్టుకుంటున్నారు మంత్రులకు కూడా వారి వారి జిల్లాలపై పెత్తనం అనేదే లేకుండా పోయింది.
చంద్రబాబు,వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలతో పాటు ఇతర ముఖ్యమంత్రుల దగ్గర పని చేసిన మంత్రులు నాడు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను చెప్పి, తమ శాఖలో తాము స్వేచ్ఛ గా పనిచేసుకున్నారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. మంత్రులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి అస్సలే లేదు. కేసీఆర్ చెప్పింది చేయాలి అంతే. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో నిర్వహించే ఆయా శాఖల సమీక్షా సమావేశాలకు కూడా సంబంధిత శాఖ మంత్రిని పిలవని సందర్భాలు అనేకం ఉన్నాయి.గతంలో మంత్రులుగా పనిచేసిన ఇప్పుడు కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్న వారు ఈ పరిణామం చూసి నోరెళ్లబెట్టడం తప్ప..నోరు తెరిచి ఇదేమిటి అని కేసీఆర్‌ను అడిగే పరిస్థితి లేదు.ఈ మంత్రులే ఒక నాడు తమకు తెలియకుండా తమ శాఖకు సంబంధించిన నిర్ణయం ఏదైనా సీఎం తీసుకున్న ఆ శాఖపై సమీక్షా నిర్వహించినా అగ్గిమీద గుగ్గిలం అయ్యి, సీఎం వ్యవహారంపై అలిగిన మంత్రి అంటూ మీడియాకు లీకులు ఇచ్చేవారు. కాని నేడు సీఎం కేసీఆర్ ఏమి చేసినా కుక్కిన పేనులా పడి ఉంటున్నారు తప్ప నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితి.ఈ పరిణామాన్ని కళ్లారా చూస్తున్న వారి అనుచరులు.. తమ నాయకుడు గతంలో హుందాగా షంషేర్ గా బతికాడు..ఇప్పుడు అవమానాలను భరిస్తూ పిల్లిలా బతకాల్సి వస్తోందని వాపోతున్నారు.
చంద్రబాబు మంత్రి వర్గంలో పనిచేసిన కడియం, తుమ్మల, పోచారం, తలసాని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రా రెడ్డి, దానం నాగేందర్‌ల తోపాటు అనేకమంది ఎమ్మెల్యేల పరిస్థితి చూసి వారి అనుచరులు త నాయకులను కేసీఆర్ జీరోలను చేసారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకులు ఎవరికీ చెప్పుకోలేక.. నాలుగు గోడల మధ్య తల పట్టుకొని తమకు ఏ గతి పట్టిందిరా బాబు అని బాధపడుతున్నారని చెబుతున్నారు.