ఐపీఎల్ 2022 సీజన్ చివరి దశకు చేరింది. ఇప్పటికే మొదటినుండి టేబుల్ టాపర్ గా కొనసాగుతూ వస్తున్న గుజరాత్ టైటాన్స్.. ఫైనల్ కు చేరిపోయింది. తాజాగా జరిగిన ఎలిమినేటర్ లో ఆర్సీబీ చేతిలో.. లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి చవి చూసి ఇంటి దారిపట్టింది. దీంతో లక్నో కెప్టెన్ కేఎల్ రాహులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. అతని ఆట తీరుపై ఆ జట్టు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాహుల్ జిడ్డు బ్యాటింగ్ కారణంగానే లక్నో ఐపీఎల్ 2022 సీజన్ నుంచి నిష్క్రమించిందని మండిపడుతున్నారు. ఉత్కంఠగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ 14 పరుగులతో లక్నోను ఓడించి.. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్ కు సిద్దమైంది. అయితే.. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ 58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 79 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించినా లాభం లేకపోయింది. కీలక సమయంలో వినూత్న షాట్ ఆడే క్రమంలో రాహుల్ ఔటవ్వడంతో మ్యాచ్ ఆర్‌సీబీ వశమైంది.
అయితే.. గతంలో మాదిరి ఈ మ్యాచ్ లో కూడా రాహుల్ చాలా నెమ్మదిగా ఆడాడని అభిమానులు ఆరోపిస్తున్నారు. టీ20 ఫార్మాట్ లో వన్డే తరహా బ్యాటింగ్ చేయడంతో లక్నో విజయాన్నందుకోలేకపోయిందని రాహుల్ పై విరుచుకుపడుతున్నారు. బ్యాటింగ్ కు అనుకూలమైన వికెట్ పై సెటిల్ అయిన బ్యాటర్ ఈజీగా రన్స్ చేస్తారని.. కానీ రాహుల్ ఆ దిశగా ప్రయత్నించలేదని మండిపడుతున్నారు. జట్టు కంటే వ్యక్తిగత ఇమేజ్ కోసమే ఆడాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 58 బంతులు ఆడి 79 పరుగులే చేయడం పెద్ద వింతేం కాదంటున్నారు. గతంలో పంజాబ్ కింగ్స్ తరఫున కూడా రాహుల్ ఇలాంటి ఇన్నింగ్స్‌లే ఆడి గెలిచే మ్యాచ్ లను చేజారేలా చేశాడని ఆరోపించారు.
అయితే.. ఇందుకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. ఆర్‌సీబీ యువ కెరటం రజత్ పటీదార్ ను చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారు. 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 పరుగులతో అజేయంగా నిలిచాడని.. అతని కంటే 5 బంతులు ఎక్కువే ఆడి విజయాన్ని అందించలేకపోయాడని కామెంట్ పెడుతున్నారు.
టైటిల్ గెలవాలన్న దూకుడు కలిగిన వ్యక్తులు జట్టులో ఉండాలి తప్పా.. వ్యక్తిగత ఇమేజ్ కోసం పరుగులు చేసే కేఎల్ రాహుల్ వంటి బ్యాటర్లు కాదని కామెంట్ చేస్తున్నారు. కేఎల్ రాహుల్ తుక్ తుక్ అకాడమీలోకి ఎంట్రీ అయ్యాడని ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. రాహుల్ ఆటను చూసి గంభీర్ తీవ్ర అసహనానికి గురయ్యాడని.. అతన్ని కిందపడేసి తంతాడనే వీడియో మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు టీం అభిమానులు.