ఓవైపు కథపై కసరత్తులు చేస్తున్నాడు కొరటాల. మరోవైపు ఆ కథ కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా ముస్తాబవుతున్నాడంటూ చాలా కథనాలొచ్చాయి. జిమ్ లో తారక్ విపరీతంగా కష్టపడుతున్నాడని, కొరటాల సినిమాలో సరికొత్త ఎన్టీఆర్ ను చూస్తారంటూ వరుసపెట్టి స్టోరీలొచ్చాయి. అవన్నీ హంబక్ అని తేలిపోయాయి.
బింబిసార మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చాడు ఎన్టీఆర్. లాంగ్ గ్యాప్ తర్వాత తొలిసారి కెమెరా ముందుకొచ్చిన తారక్ ను చూసి ఆశ్చర్యపోవడం ఆడియన్స్ వంతయింది. ఎందుకంటే.. ఎన్టీఆర్ పూర్తిగా మారిపోయాడు. కానీ.. ఇది జిమ్ లో కసరత్తులు చేయడం వల్ల వచ్చిన మార్పు కాదు. ఎలాంటి ఎక్సర్ సైజులు చేయకుండా, ఫిజిక్ ను పట్టించుకోకపోవడం వల్ల వచ్చిన మార్పు.
ఎన్టీఆర్ లావు అయిపోయాడు. ఈమధ్య కాలంలో ఎన్టీఆర్ ను ఇంత లావుగా ఎప్పుడూ చూడలేదు. దాదాపు 10-12 ఏళ్ల నుంచి తన ఫిజిక్ ను కాపాడుకుంటూ వస్తున్నాడు తారక్. మధ్యలో జై లవకుశ టైమ్ లో కాస్త బరువు పెరిగినా, మళ్లీ మారిపోయాడు. ఆర్ఆర్ఆర్ కోసమైతే పర్ ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేశాడు.
అదే ఫిజిక్ ను కొరటాల శివ సినిమా కోసం కూడా కొనసాగిస్తాడని, వీలైతే ఇంకాస్త తగ్గుతాడని అంతా అనుకున్నారు. కానీ, ఎన్టీఆర్ బరువెక్కాడు. ఎంతలా అంటే, రాఖీ సినిమా టైమ్ లో ఎలా ఉండేవాడో, దాదాపు ఆ అవతారానికి వచ్చేశాడు. దీంతో కొరటాల సినిమా కోసం ఎన్టీఆర్ మేకోవర్ అవుతున్నాడనే కథనాలన్నీ పచ్చి అబద్ధాలని తేలిపోయాయి.