గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. విడుదలైన తొలి రోజు, తొలి ఆటకే సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చేసింది. సాధారణంగా ఓ సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆ ప్రభావం యూనిట్ పై పడుతుంది. కానీ.. పక్కా కమర్షియల్ సినిమా ఫ్లాప్ అవ్వడం, ఆ ఎఫెక్ట్ ప్రభాస్ పై పడింది.
త్వరలోనే మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. పక్కా కమర్షియల్ దెబ్బతో, ఇప్పుడా సినిమా చేయొద్దంటూ అభిమానులు కోరుతున్నారు. పెద్ద హీరోల్ని హ్యాండిల్ చేసిన ప్రతిసారి మారుతి తడబడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.
గతంలో వెంకటేష్ ను డైరక్ట్ చేసినప్పుడు, ఆ తర్వాత నాగచైతన్యతో సినిమా తీసినప్పుడు, ఇప్పుడు గోపీచంద్ తో మూవీ డైరక్ట్ చేసినప్పుడు.. ఇలా ప్రతి సందర్భంలో మారుతి ఫెయిల్ అయ్యాడని.. ఇలాంటి దర్శకుడికి అవకాశం ఇచ్చి కెరీర్ పాడుచేసుకోవద్దంటూ ప్రభాస్ ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పడుతున్నాయి.
అటు నిర్మాత అశ్వనీదత్ కూడా ఈ విషయంపై ప్రభాస్ కు చిన్నపాటి క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఓవైపు సలార్, ప్రాజెక్ట్-కె లాంటి సినిమాలు పెట్టుకొని, చిన్న దర్శకుడితో మూవీ చేస్తే, ఆ ప్రభావం తమ సినిమాలపై పడుతుందని, తప్పనిసరి పరిస్థితుల మధ్య మారుతితో సినిమా చేయాల్సి వస్తే, దాన్ని ఓ 4 ఏళ్ల తర్వాత పెట్టుకోవాలని సూచించాడట.
ఇలా పక్కా కమర్షియల్ సినిమా ఫ్లాప్ అవ్వడం, ఆ ఎఫెక్ట్ ప్రభాస్ పై వెంటనే పడింది. మరోవైపు ప్రభాస్ సినిమాకు కూడా రాశిఖన్నానే రిపీట్ చేసి, మరో రోత క్యారెక్టర్ పెడతావా అంటూ మారుతిపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది.