సినీ ప్రేక్షుకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆర్ఆర్ఆర్ సినిమా శుక్రవారం థియేటర్లలో సందడి చేస్తోంది. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. అయితే, పలు చోట్ల అభిమానులు అత్యుత్సాహం చూపారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రికత్తలు చోటు చేసుకున్నాయి.
విజయవాడ అగ్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్ల వద్ద అభిమానుల సందడితో పండగ వాతావరణం నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు థియేటర్ల వద్ద బాణసంచా కాల్చుతూ, డిజేలు పెట్టి డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. అయితే, అన్నపూర్ణ థియేటర్‌లో సాంకేతిక కారణాలతో ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆటంకం కలిగింది.
షో ప్రారంభమైన గంటలో స్క్రీన్ నిలిచిపోయింది. దీంతో ఆగ్రహంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు రెచ్చిపోయి థియేటర్‌లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
అనంతరం స్క్రీన్ రిపేర్ చేసిన థియేటర్ యాజమాన్యం ఆర్ఆర్ఆర్ షోను కొనసాగించారు. కాగా, ఫ్యాన్స్ థియేటర్‌లో విధ్వంసానికి పాల్పడిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే, ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో అన్నపూర్ణా థియేటర్‌లో ముందు జాగ్రత్తగా తెర వద్ద మేకులు కొట్టిన చెక్కలను అమర్చారు. అంతేగాక తెరవద్దకు వస్తే అపాయం అని హెచ్చరిక బోర్టులు కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.