నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు, విపక్షాల ఆందోళనలు ఉధృతమవుతుండటంతో.. బీజేపీ ఆ హీట్‌ను తగ్గించేందుకు ప్లాన్ చేస్తోంది. మూడు చట్టాల్లో ఉన్న ముఖ్యాంశాలపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది.త్వరలో భారీ క్యాంపెయిన్ కార్యక్రమానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా 100 ప్రెస్‌మీట్లు, 700 జిల్లాల్లో రైతులతో సమావేశాలను నిర్వహించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.ఈ ప్రచారంలో బీజేపీ ముఖ్య నేతలంతా పాల్గొంటారు. చట్టాలపై అన్నదాతల్లో నెలకొన్న అనుమానాలను ఈ సమావేశాల్లో తీర్చనుంది.
మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. కేంద్రం సవరణలకు సిద్ధంగా ఉన్నా.. రైతులు మాత్రం చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం దిగిరాకపోతే ఆందోళననను మరింత ఉధృతం చేసేందుకు రైతుల సంఘాలు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేశాయి.