సర్పంచ్ వేధిస్తున్నాడని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఆత్మహత్యాయత్నానికి ముందు బాధితుడు సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో చోటు చేసుకుంది. కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామ పంచాయితీ సర్పంచ్ కాసాని సైదులు తన గ్రామ పంచాయితీలోని నేషనల్ హైవే పక్కన ఏడాదికి రెండు పంటలు పండే భూములను చౌకగా దక్కించుకునేందుకు ప్లాన్ వేశాడు. పదవిని అడ్డుపెట్టుకుని కొంతమంది ప్రజా ప్రతినిధుల అండదండలతో బలవంతంగా భూమిని స్వాహా చేసేందుకు పూనుకున్నాడు.
గత మూడు సంవత్సరాలుగా పోలెబోయిన ఉపేందర్ అనే వ్యక్తిని మాసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఉపేందర్ బుధవారం తన ఫోన్ లో సెల్ఫీ వీడియో తీస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని వీడియోలో చెప్పి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు.
2012 నుంచి భూమిని కొనుగోలు చేసి సాగు చేస్తున్నానని, 2017లో నేషనల్ హైవే పొలం గుండా మంజూరైంది.. దీంతో ఒక ఎకరం ఇరవై ఆరు కుంటలు హైవేకు పోగా.. మిగిలిన మూడు కుంటల భూమిలో ఇంటి కోసం చిన్న షెడ్డు నిర్మాణం చేపట్టానని చెప్పుకొచ్చాడు బాధితుడు. ఇది జీర్ణించుకోలేని సర్పంచ్ సైదులు.. ఆ స్థలంలో దేవుడి గుడి నిర్మాణం చేపడతామని హుకుం జారీ చేస్తున్నాడని వీడియోలో తెలిపాడు.
అంతేకాకుండా ఆ స్థలం నుంచి వెళ్లిపోవాలని పలు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వీడియోలో వాపోయాడు బాధితుడు. దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నానని వీడియోలో చెప్పాడు ఉపేందర్. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు 108 సహాయంతో ఆస్పత్రికి తరలించారు. సర్పంచ్ అరాచకాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నానని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.