కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కరాన్ని సీపీఎం సీనియర్ నేత, బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య తిరస్కరించారు. ఈ అవార్డుపై ఇంతవరకూ తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం నిజంగా తనకు పద్మ అవార్డు ఇవ్వాలని నిర్ణయించి ఉంటే.. దానిని తాను వెనక్కి ఇచ్చేస్తానని భట్టాచార్య తెలిపారు.
దీనిపై కేంద్ర ప్రభుత్వవర్గాలు కూడా స్పందించాయి. కేంద్ర హోంశాఖ కార్యదర్శి భట్టాచార్యను ఈ అవార్డుకి ఎంపిక చేసినట్టు ఆయన భార్యకు మంగళవారం ఉదయం చెప్పినట్టు తెలిపింది. దీనిపై ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు కూడా తెలిపారని చెబుతోంది. ఈ విషయంలో నిజానిజాలు ఎలా ఉన్నా.. పద్మ పురస్కారాలకు ఎంపిక చేసే ముందు గ్రహీతలతో మాట్లాడుతుంది.
తరువాత వారి నుంచి అంగీకారం వచ్చిన తరువాతే ప్రకటిస్తుంది. ఇలా పద్మ పురస్కరాలను తిరస్కరించడం చాలా అరుదుగా జరుగుతుంది. మంగళవారం కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది. నలుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురకి ఈ అవార్డులు వరించాయి. తెలంగాణ నుంచి దర్శనం మొగిలయ్య, పద్మజారెడ్డి, రామచంద్రయ్యలను పద్మశ్రీలు లభించాయి. ఏపీ నుంచి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు, సుంకర వెంకట ఆదినారాయణ, షేక్ హసన్ కు పద్మశ్రీ దక్కింది.