ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి.. తాతల కాలం నాటి నుంచి వారికి అదే ఆధారం. కానీ.. సడెన్ గా ఓ వ్యక్తి ఎంటరై.. ఈ భూమి తనదని బెదిరించాడు. షాకయిన ఆ కుటుంబం అధికారులను సంప్రదించింది. షరా మామూలే. ఎవరూ పట్టించులేదు. ఇంకోవైపు కబ్జా పెట్టిన వ్యక్తి నుంచి బెదిరింపులు పెరిగిపోతున్నాయి. దీంతో చేసేది లేక రెవెన్యూ ఆఫీస్ కు పురుగులు మందు డబ్బాతో వెళ్లింది బాధిత కుటుంబం.
వివరాల్లోకి వెళ్తే… ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కౌటబి గ్రామానికి చెందిన నర్సింగ్ ఫ్యామిలీ.. 60 ఏళ్ల క్రితం సర్వే నెం 23లో 15 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఆ భూమిని నర్సింగ్ అతని కుమారుడు నారాయణ సాగు చేసుకుంటున్నారు. అయితే వారికి తెలియకుండా బోథ్ కు చెందిన ఓ వ్యక్తి తన పేరుమీద పట్టా చేసుకున్నాడు. భూమి తనదేనంటూ కొన్ని రోజులుగా నర్సింగ్ ఫ్యామిలీని వేధిస్తున్నాడు. దీంతో బాధిత కుటుంబం రెవెన్యూ అధికారులకు పలుమార్లు చెప్పింది. ఎవరూ పట్టించుకోలేదు. చేసేదిలేక మంగళవారం నర్సింగ్, ఆయన భార్య లక్ష్మితో పాటు అక్క గంగుబాయి తహసీల్దార్ కార్యాలయానికి పురుగుల మందు డబ్బాతో వచ్చారు. తమకు న్యాయం చేయకపోతే ఇక్కడే తాగి ఆత్మహత్యకు పాల్పడతామని చెప్పారు. అధికారులు లంచం తీసుకుని అక్రమంగా తమ భూమిని పట్టా చేసి ఇచ్చారని ఆరోపించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నర్సింగ్ చేతిలో ఉన్న పురుగుల మందు డబ్బాను లాగేశారు.