పట్టాదారు పాస్ పుస్తకం కోసం అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు ఓ రైతు. ఒకటి కాదు రెండు కాదు 20 ఏళ్లుగా ఇదే తంతు. కాళ్ల వాపులు, నొప్పులు తప్ప ఎలాంటి ఫలితం ఉండడం లేదు. దీంతో చేసేది లేక కలెక్టర్ ఛాంబర్ ముందు కుమారుడితో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. భువనగిరిలో వెలుగుచూసింది ఈ ఘటన.
ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన ఉప్పలయ్య 20 ఏళ్ల క్రితం 8 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. వాటిలో నాలుగు ఎకరాలకు పట్టాదారు పుస్తకం కోసం అప్లై చేశాడు. కానీ.. ఇప్పటికీ అది మంజూరు కాలేదు. కలెక్టరేట్, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదు. దీంతో విసిగిపోయిన ఉప్పలయ్య.. కుమారుడు మహేష్ తో కలిసి భువనగిరి కలెక్టరేట్ కు వెళ్లాడు. తమ భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తారా లేదా అంటూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
తండ్రీ కుమారులు ఇద్దరూ పెట్రోల్ పోసుకుంటుండగా.. చుట్టుపక్కలవారు గమనించి అడ్డుకున్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.