తెలంగాణ రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని నల్గొండ ఎంపీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని వజినేపల్లి గ్రామంలో నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే పరిష్కారం చూపుతుందన్నారు.
గత ఎనిమిదేళ్లుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్షలాది మంది రైతులు, వారి కుటుంబాల సంక్షేమాన్ని విస్మరించి వారి జీవితాలను నాశనం చేసిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కైన టీఆర్‌ఎస్.. తెలంగాణలో రైతాంగాన్ని నామారూపాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
రైతు డిక్లరేషన్ పేరిట గ్రామ గ్రామాన 40 రోజుల పాటు కాంగ్రెస్ రైతు భరోసా యాత్ర చేపడతామని ప్రకటించారు ఉత్తమ్. ఈ యాత్రలో భాగంగా దాదాపు 250 గ్రామాలు, మూడు మున్సిపాలిటీల ప్రజలను కలవనున్నట్టు తెలిపారు. 35 రోజుల పాటు ప్రతిరోజూ సుమారు 8 గ్రామాలు లేదంటే మూడు మున్సిపాలిటీలలో గల వార్డులలో సమావేశాలు నిర్వహించనున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతులను పరామర్శించడానికి తీరికలేని సీఎం కేసీఆర్.. పంజాబ్ రైతులకు పరిహారం ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసమర్థ పాలన చేస్తూ రాష్ట్రాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ల్యాండ్, సాండ్, మైన్, వైన్ పేరిట గ్రామాల్లో, నియోజకవర్గాల్లో వందల కోట్లు దోచుకుంటున్నారని విరుచుకుపడ్డారు ఉత్తమ్.