సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో పట్టువీడకుండా పోరాటం చేస్తున్న రైతులు .. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసే పనిలోపడ్డారు. ఈ మేరకు రైతు సంఘాలు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించాయి. ఈ నెల 26న సంపూర్ణ భారత్ బంద్ నిర్వహించాలని భావిస్తున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తాము మొదలుపెట్టిన పోరాటం.. ఈ నెల 26తో నాలుగు నెలలు పూర్తి చేసుకుంటున్నందున భారత్ బంద్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్టు స్పష్టం చేశాయి.ఉదయం నుంచి సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా శాంతియుతంగా ఈ బంద్ నిర్వహిస్తామని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఇక మార్చి 29న హోలీకా దహన్‌పేరిట సాగు చట్టాల ప్రతులను దగ్ధం చేయాలని నిర్ణయించాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15న ట్రేడ్ యూనియన్ల పిలపునిచ్చిన ఆందోళనలోనూ పాల్గొంటామని రైతు సంఘాలు వెల్లడించాయి.