భూ వివాదంలో తలదూర్చడమే కాకుండా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అమంగల్ ఎస్సై ధర్మేష్ పై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు అందింది. కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్న పోలీస్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఓ రైతు కుటుంబం వేడుకుంది.
రంగారెడ్డి జిల్లా అమంగల్ కు చెందిన రైతు యాదయ్య కుటుంబం… తమకు శ్రీశైలం జాతీయ రహదారిపై 9 గుంటల భూమి ఉందని హెచ్చార్సీకి తెలిపింది. ఆ భూమిపై గట్ల జగదీష్ అనే వ్యాపారి కన్నుపడిందని.. స్థానిక రౌడీలతో కలిసి కబ్జా చేశాడని వివరించింది. ఈ విషయంలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా, కబ్జా చేసిన వారికే సహకరించారని చెప్పింది.
అమంగల్ ఎస్సై ధర్మేష్ కబ్జాదారులతో కుమ్మకై తమపై అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తోంది యాదయ్య కుటుంబం. భూమిని వదులుకోకపోతే పీడీ యాక్ట్ పెడతానని బెదిరింపులకు పాల్పడుతున్నారని.. తగిన చర్యలు తీసుకొని తమకు రక్షణ కల్పించాలని హెచ్చార్సీని వేడుకుంది బాధిత కుటుంబం.