ధరణి పోర్టల్ పది లక్షల మంది రైతులను మానసికంగా హింసిస్తోందని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కుమార్ అన్నారు. దాని కారణంగా ఇప్పటికే ఐదుగురు రైతులు మరణించారని తెలిపారు. రైతుల పట్ల చిత్త శుద్ధి ఉంటే వెంటనే ధరణిని రద్దు చేసి.. పాత పద్ధతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ ను తీసుకొచ్చి రైతులకు కొత్త సమస్యలు సృష్టించారని మండిపడ్డారు. ధరణిలోని సమస్యలను పరిష్కరించకుండా.. దానిని రద్దు చేయకుండా పాలకుల మూర్ఖత్వానికి పరాకాష్టగా నిలుస్తున్నారని అన్నారు.
కష్టాల్లో ఉన్నప్పుడు అవసరాలకు తమ భూమిని అమ్ముకోలేక.. తమ సమస్యను ఏ అధికారికి మొరపెట్టుకోవాలో తెలియక రైతులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. భవిష్యత్ లో ప్రభుత్వ ఓటమికి ధరణి పోర్టల్ కూడా ఒక కారణం అవుతోందన్నారు. ధరణి కారణంగా సొంత భూమిపై హక్కును కోల్పోయిన రైతులకు రైతు బంద్ రావడం లేదన్నారు. ఎక్కడా చూడని చిత్ర విచిత్రాలు ధరణిలో కనబడుతున్నాయన్నారు. అమ్మని భూమిని అమ్మినట్లు.. కొనని భూమిని కొన్నట్లు.. అసలు యజమానులకు ఆ భూమిపైన ఏ హక్కు లేనట్టు.. భూమి లేని వాడికి పూర్తి హక్కులు ఉన్నట్టు చూపిస్తోందని ఆరోపించారు.
ధరణి సమస్యలను సరి చేయలేక సోమేష్ కుమార్ సొమ్మసిల్లి పోయారని.. ఇదేం ధరణి సారు.. ముఖ్యమంత్రి గారు.. మీరైనా దృష్టి పెట్టి ధరణిని దారికి తీసుకురండి. మీతో కూడా కాకుంటే.. దానిని రద్దు చేయండి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ మొదటి నుండే ధరణిని వ్యతిరేకిస్తోందని అన్నారు. ధరణికి వ్యతిరేకంగా తాము పోరాటాలు చేయకపోయి ఉంటే లక్షల ప్లాట్లు రిజిస్ట్రేషన్ లకు నోచుకోకపోయేటివని అన్నారు. తమ పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం వ్యవసాయేతర ప్రాపర్టీల రిజిస్ట్రేషన్ ల విషయంలో ధరణిని వెనకకు తీసుకుందని తెలిపారు.
Advertisements
మంకు పట్టును వీడి.. ధరణిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ధరణి రద్దుతోనే రైతుల గోస తీరుతోందన్నారు. ధరణి పోర్టల్ ను తీసుకురావడానికి ముందు.. భూములపై సరైన అధ్యయనం చేయక పోవడమే ఈ సమస్యలకు కారణమన్నారు. ఇందులో ప్రభుత్వ సొంత ప్రయోజనాలు తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనాలు లేవన్నారు. ప్రతిపక్షాలు ధరణి సమస్యలు తెర మీదికి తేవడంలో విఫలం కావడంతో ధరణి డొల్లతనం బయట పడటం లేదని ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యనించారు.