– ఎక్కడి సమస్యలు అక్కడే..
– ప్రజావాణి కార్యక్రమానికి వేలల్లో ఫిర్యాదులు
– కలెక్టరేట్లలో ధరణి హెల్ప్ డెస్కులు పెట్టాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం
– ప్రభుత్వ నిర్ణయాన్ని గాలికొదిలేసిన అధికారులు
– తహసీల్దార్ లు, ఆర్డీవోలు చేయాల్సిన పనులను కిందిస్థాయి ఉద్యోగులకు అప్పగింత
– పనిభారంతో ఎక్కడిక్కడే సతమతం అవుతున్న ఉద్యోగులు
ధరణి పోర్టల్ ను తీసుకువచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ.. సమస్యల పరిష్కారం మాత్రం ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. పట్టించుకునే నాథుడు కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలలో ప్రతి సోమవారం ప్రజావాణిలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతీ రోజు దాదాపు 90 శాతం మంది రైతులు ధరణి ద్వారా ఏర్పడ్డ సమస్యలు పరిష్కారం చేయాలని కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తున్నారు. అయినా ఏడాది గడుస్తున్నప్పటికీ.. ధరణి సమస్యలు మాత్రం పూర్తి కావట్లేదు.
సమస్యల పరిష్కారం కోసం వరుస సమావేశాలు ఏర్పాటు చేసుకోవడమే తప్ప.. గుర్తించిన సమస్యలను కూడా పరిష్కరించలేకపోతున్నారు అధికారులు. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లలో ధరణి హెల్ప్ డెస్కులు పెట్టాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. డెస్కుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి.. దరఖాస్తుల అప్ లోడ్ కు అవకాశం ఇస్తున్నట్టు కమిటీ తెలిపింది. ప్రస్తుతమున్న మాడ్యూళ్లపై అవగాహన లేక సమస్యలు పరిష్కారం కావడం లేదని అభిప్రాయపడుతున్నారు. భూ రికార్డుల నమోదులో పొరపాట్లను సరిచేసేందుకు కావాల్సిన మాడ్యూళ్లను త్వరగా అందుబాటులోకి తేవాలని ఆఫీసర్లను ఆదేశించారు. కానీ.. అధికారులు మాత్రం కమిటీ గుర్తించిన సమస్యలను పరిష్కారం చేయడం లేదు. మాడ్యూళ్లను అందుబాటులోకి తీసుకురావాలని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించినా.. ఇప్పటి వరకు మాడ్యూళ్లను మాత్రం అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతో చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు.
ధరణి సమస్యలపై సవరణల కోసం తహశీల్దార్ లకు కాకుండా కలెక్టర్ లకు అవకాశం ఇవ్వడంతో గ్రామాల్లోని రైతులు చాలామంది కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ధరణీ పోర్టల్ ఏర్పాటు చేసి రైతుల సమస్యలు 94 శాతం పరిష్కరించినట్లు ప్రకటించింది. కానీ.. వాస్తవానికి రెవెన్యూ సమస్యలు పరిష్కారం కోసం వేల మంది రైతులు కోర్టుల చుట్టూ.. తహసిల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ.. ప్రతి రోజు తిరుగుతునే ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాకు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం పాటు.. రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ చట్టాలను కాలానుగుణంగా మార్చుకుంటూ వెళ్లడం..వంటివి చేస్తేనే భూ సమస్యలు పరిష్కారం అవుతాయంటున్నారు నిపుణులు.
సమస్యలన్నీ పరిష్కారం చేయకుండా.. ధరణి పోర్టల్ లో అప్షన్ లు చేంజ్ చేయడం వల్ల రోజుకో సమస్య పెరుగుతుందే తప్పా సమస్యలు సాల్వ్ కావని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తహశీల్దార్ లు, ఆర్డీవోలు చేయాల్సిన పనులను కూడా తమకు అప్పగించడంతో.. పని ఒత్తిడి భారంతో ఏ సమస్యకు పరిష్కారం చూపలేకపోతున్నామని కింది స్థాయి ఉద్యోగులనుండి టాక్ వినిపిస్తోంది. చాలా ఫైల్స్ పెండింగ్‌లో ఉంటున్నాయని కలెక్టర్ కార్యాలయాల్లోని అధికారులు ఆఫ్ ది రికార్డుగా చెప్తున్నారు.