దేశానికి అన్నంపెట్టే అన్నదాత కడుపు మాడ్చుకోబోతున్నాడు. కేంద్రం తెచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని జరుగుతున్న పోరాటంలో బక్కపల్చని రైతన్న పోరాడుతూనే ఉన్నాడు. ట్రాక్టర్ల ర్యాలీలో జరిగిన హింస తర్వాత కొన్ని రైతు సంఘాలు వెనకడుగు వేసినా… రైతన్న పోరాటం ఆపటం లేదు. వెన్నుచూపని తన నైజాన్ని ఆచరణలో మరోసారి చూపిస్తున్నాడు.
ఓవైపు స్థానికుల పేరుతో దాడులు జరుగుతున్నా, పరిస్థితిని అదుపు చేస్తాం అన్న పేరుతో పోలీసుల దాడులు కొనసాగుతున్నా… కన్నీరు పెట్టుకుంటూనే రైతులు పోరాటం కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. రైతు సంఘం నేత రాకేష్ తికాయత్ కంట కన్నీరు చూసిన తర్వాత పంజాబ్, హర్యానాల నుండి భారీగా రైతులు సింఘు బార్డర్ కు చేరుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో పెద్దల నిర్ణయం ప్రకారం ఇంటికో మనిషి ఢిల్లీ బార్డర్ కు చేరుకోవాలని నిర్ణయించారు.
గాంధీ వర్ధంతి రోజైన శనివారం సద్భావన దివాస్ చేయాలని పిలుపునిచ్చారు. రైతులంతా శనివారం ఉపవాస దీక్షను చేయనున్నారు.