శుక్రవారం కామారెడ్డి బంద్ కు పిలుపునిచ్చారు రైతులు. ప్రస్తుతం తాత్కాలికంగా రైతులు ఆందోళనను విరమించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద దిష్టిబొమ్మకు వినతి పత్రం అందించారు. అంతకుముందు కలెక్టరేట్ వద్ద రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఆందోళనలో ఇద్దరు మహిళలు, ఓ రైతు సొమ్మసిల్లి పడిపోయారు. తోపులాటలో కానిస్టేబుల్ కు స్వల్పగాయాలయ్యాయి. కామారెడ్డి కలెక్టరేట్ లోకి దూసుకెళ్లేందుకు రైతులు యత్నించారు. ఈ క్రమంలో కలెక్టరేట్ ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లను రైతులు తొలగించారు. కలెక్టరేట్ గేటుకు పోలీసులు వేసిన తాళాన్ని రైతులు తొలగించారు. గేటు దూకి కలెక్టరేట్ లోకి కొందరు రైతులు వెళ్లారు.
కాగా ఇండస్ట్రియల్ జోన్ కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ కారణంగా భూమిని కోల్పోతున్నాననే బాధతో రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రైతు ఆత్మహత్యకు నిరసనగా గురువారం కామారెడ్డి జిల్లా అడ్లూర్ లో రైతులు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది.
రైతులు భారీ మార్చ్ కు సిద్ధమయ్యారు. దీనికి బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది. మాస్టర్ ప్లాన్ లో తమ భూములు పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త మాస్టర్ ప్లాన్ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎనిమిది గ్రామాల రైతులు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు.
కలెక్టరేట్ ముట్టడికి రైతులు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కొత్త మాస్టర్ ప్లాన్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా స్థానిక ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసం ఎలా వస్తారో చూస్తామని హెచ్చరించారు రైతులు.
మాస్టర్ ప్లాన్ లో భూమి పోవడంతో రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా రాములు ఆత్మహత్యతో రైతులు ఆందోళనకు దిగారు. అయితే మాస్టర్ ప్లాన్ పై కామారెడ్డి రైతులు గత కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు.