సంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చెరువునీరు తమ పొలాలకు రాకుండా అడ్డుకుంటున్నారని రైతులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన జిల్లా పరిధిలోని ఆందోల్ నియోజకవర్గ కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆందోల్ గ్రామంలోని తిరుమలయ్య చెరువును నమ్ముకొని 200 మంది రైతులు 186 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నారు. ఇందులో 50 ఎకరాల భూమి చెరువు శిఖంలో ఉంది.
50 ఎకరాల్లో నాందేడ్, ఆకొల జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న 12.6 ఎకరాల భూమిని ఓ వ్యాపార వేత్త కొనుగోలు చేశాడు. అయితే.. ఈ భూమి రహదారి పక్కనే ఉండటంతో వర్షానికి వచ్చే వరదతో భూమి నీటిలో మునిగిపోతోంది. దీంతో ఆ వ్యాపార వెత్త మల్లన్నగుట్ట, తిరుమలయ్య గుట్ట ప్రాంతాలనుండి మట్టి తోడుకొచ్చి తన భూమిలో పోస్తున్నాడు. అతను కొన్న భూమి చెరువు శిఖం అయినప్పటికీ.. రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని చెరువు భాగాన్ని పట్టా చేయించుకున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు.
మట్టితో పూడికపోయడంతో చెరువు కింద భూములున్న 200 మంది రైతుల వ్యవసాయానికి సింగూర్ కెనాల్ నుండి వచ్చేటటువంటి నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతంలో భూములున్న రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయమై జిల్లా అధికారులను, రెవెన్యూ అధికారులను ఆశ్రయించినా ప్రయోజనం లేదని మొరపెట్టుకుంటున్నారు. ఎన్నిసార్లు అధికారులకు తమ గోడును విన్నవించుకున్నా.. పట్టించుకున్న నాథుడే లేకుండాపోయాడని రైతులు ఆవేదన చెందుతున్నారు.
దీంతో చేసేదేం లేక రైతులు ధర్నాకు పిలుపునిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేపట్టారు. తాము ఎవరినీ ఏమీ అనడంలేదని.. తమ చెరువులోకి నీరు సజావుగా రావడానికి కొట్లాతున్నామని పేర్కొన్నారు. వ్యాపారవేత్త అడ్డంగా పోసిన మట్టిని తొలగిస్తే తమకు ధర్నా చేయాల్సిన అవసరం ఏముందని వాపోతున్నారు బాధిత రైతులు. మట్టిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.