– గిట్టు బాటు ధర లేక వెనుతిరిగిన రైతులు
– మూడు రోజులు గా మిల్లుల ముందు నిరీక్షణ
– పట్టించుకోని మిల్లర్లు
– సూర్యాపేట మార్కెట్లో దారుణం
– రాజకీయ నాయకుల పైరవీ ఉంటే క్వింటాకు రూ.1900
– లేకుంటే రూ. 1300 నుండి రూ.1400 మాత్రమే
– గిట్టు బాట ధర కల్పించాలని రైతుల నిరసనలు
– స్పందించిన కలెక్టర్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న వడ్ల పంచాయతీతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. కేంద్రం మీద రాష్ట్రం.. రాష్ట్రం మీద కేంద్రం విమర్శలు చేసుకుంటూ పూట గడుపుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరో పక్క రైతులు పండించిన పంటను కొనే దిక్కు లేక చేసిన కష్టం నేలపాలవుతోందని రైతులు కంటనీరు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే కేంద్రం వరి ధాన్యానికి రూ. 1900 గిట్టు బాటు ధరను కల్పించింది. అయితే.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో.. మిల్లర్లు కేటాయించిన ధరకే ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది.
తాజాగా.. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో.. రైతులకు నిరాశే ఎదురైంది. మూడు రోజుల క్రితం తీసుకొచ్చిన ధాన్యానికి రూ.1400 నుంచి రూ.1500 వరకు ధర పలుకుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టం చేసి.. శ్రమించి పండించిన ధాన్యాన్ని వ్యాపారులు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో తెచ్చిన ధాన్యాన్ని తిరిగి ఇళ్లకు తీసుకెళ్తున్నారు. పంటకు తగిన ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మార్కెట్లో రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ.. మద్దతు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు.
మార్కెట్లోనే కమీషన్, ఖరీదుదార్లు కనీస గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులను నిలువునా దోచుకుంటున్న పరిస్థితి దాపురించిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా నిరసన అనంతరం శనివారం మార్కెట్ ను పరిశీలించిన కలెక్టర్.. ట్రేడర్స్ తో మాట్లాడి రీ బిడ్డింగ్ వహించారు. అయినప్పటికీ ధరలు అందించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో అమ్మకానికి తెచ్చిన ధాన్యాన్ని తిరిగి ఇంటికి తీసుకెళ్తున్నారు రైతులు.
ఇదిలా ఉంటే.. రాజకీయ నాయకుల పైరవీలు ఉన్న వారికి క్వింటాకు రూ. 1900 నుంచి రెండు వేల వరకు కొనుగోళ్లు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నేరుగా వెళ్తే మిల్లర్లు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి రాజకీయ పైరవీలు లేకుండా పోతే.. వ్యాపారులు రూ.1400లకు మించి కొనమని తేల్చి చెప్తున్నారని కంటనీరు పెట్టుకుంటున్నారు రైతులు. టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప రైతుకు మద్దతు ధర అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల ఆందోళనను తెలుసుకున్న కలెక్టర్ మార్కెట్ వద్దకు వచ్చి అర్ధరాత్రి వరకు ఉండి రైతులతో మాట్లాడారు. ధర పెరిగే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం నిర్వహించిన రీ బిడ్డింగ్ లో ట్రేడర్స్ ఐదు, పది రూపాయలు నామమాత్రంగా పెంచి చేతులు దులుపుకున్నారని రైతులు కలెక్టర్ కు విన్నవించుకున్నారు. ఖరీదుదారులతో మాట్లాడినప్పటికీ రైతుకు గిట్టుబాటు ధర కల్పంచడంలేదని తమగోడును వెల్లబోసుకున్నారు.
Advertisements
అయితే తమకు పంట పెట్టుబడితోపాటు ధాన్యం రవాణాకు చేసిన ట్రాక్టర్ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయాయని వాపోయారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కనీస ధర లభించేలా కృషి చేయాలని రైతులు వేడుకుంటున్నారు. లేదంటే పంట పండించడానికి పెట్టు బడులకు తీసుకొచ్చిన అప్పులు కుప్పలుగా పెరిగాయని..గిట్టుబాటు ధర లభించకపోతే తమకు చావే శరణ్యం అవుతోందని కంటనీరు పెట్టుకున్నారు రైతన్నలు.