సాగు చట్టాలను రద్దు చేసేందుకు అక్టోబర్ 2వ తేదీ వరకు కేంద్రానికి గడువు ఇస్తున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. ఈ మేరకు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయిత్ స్పష్టం చేశారు. అప్పటికి కూడా ప్రభుత్వం విఫలమైతే భవిష్యత్ నిరసనలకు కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు.
మూడు గంటల సేపు దేశవ్యాప్తంగా చేపట్టిన రహదారుల దిగ్బంధం కార్యక్రమంగా ప్రశాంతంగా ముగిసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఘజిపూర్ సరిహద్దుల్లో మాట్లాడుతూ… రైతు ఆందోళనలను అక్టోబర్ 2 వరకూ పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. అంతవరకూ చట్టాల రద్దుకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామన్నారు. గడువు దాటిన తర్వాత తదుపరి కార్యాచరణతో ముందుకు వెళ్తామని తెలిపారు. రైతుల డిమాండ్లు నెరవేరేంత వరకూ ఇళ్లకు తిరిగి వెళ్లేది లేదని తికాయిత్ స్పష్టంచేశారు.
రిపబ్లిక్ డే ఘటనల తర్వాత చేపట్టిన రహదారుల దిగ్బంధం శాంతియుతంగా విజయవంతం కావటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.