హన్మకొండ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిల్లాలోని ఐనవోలు మండల పరిదిలోని పెరుమాండ్ల గూడెంగ్రామానికి చెందిన రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి పై బైఠాయించారు గ్రామస్థులు.
ధర్నాలో బీజేపీ శ్రేణులు పాల్గొనడంతో ఉద్రిక్తత ఏర్పడింది. రైతులను విచక్షణారహితంగా కొట్టిన పోలీసులపై చట్టరిత్యా చర్యలు తీసుకొని.. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పై దాడి చేసిన పోలీసులు వెంటనే విధుల నుండి బహిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
దేశానికి అన్నం పెట్టే రైతులను దేశద్రోహుల్లా చేసి చిత్రహింసలకు గురి చేసి రక్తం వచ్చేలా కొట్టారని ఆరోపించారు. దీంతో.. జాతీయ రహదారిపై సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అప్పటికే భారీగా మోహరించిన పోలీసు బలగాలు ఆందోళనకారులను అరెస్టు చేసి మామునూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
రైతులపై దాడులు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వతం పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. బాధిత రైతులకు న్యాయం జరిగేంత వరకు రైతుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు బీజేపీ నాయకులు.