సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ తన భావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగ గొప్పదనం గురించి చెప్పారు. రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, పథకాల గురించి తెలిపారు.
తెలంగాణ వ్యవసాయ రంగంలో చోటు చేసుకున్న విప్లవాత్మక ప్రగతి స్ఫూర్తితో.. యావత్ దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగైన రోజే భారతదేశానికి సంపూర్ణ క్రాంతి చేకూరుతుందని కేసీఆర్ అన్నారు. భోగి, మకర సంక్రాంతి,కనుమ పండుగలను పురస్కరించుకొని దేశ,రాష్ట్ర రైతాంగానికి,ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పంట పొలాల నుంచి ధాన్యపు రాశులు చేరుకున్న శుభ సందర్భంలో రైతన్న చేసుకునే సంబురమే సంక్రాంతి అని ఆయన అన్నారు.
నమ్ముకున్న భూతల్లికి రైతు ధన్యవాదాలు తెలిపే రోజే పండుగని సీఎం చెప్పారు. తెలంగాణ వ్యవసాయ పునరుజ్జీవ కార్యాచరణతో తెలంగాణ పల్లెలు పచ్చని పంట పొలాలు,ధాన్యపు రాశులు,పాడి పశువులు,కమ్మని మట్టివాసనలతో సంక్రాంతి శోభను సంతరించుకుని వైభవోపేతంగా వెలుగొందుతున్నాయని కేసీఆర్ అన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి లక్షలాది కోట్లు ఖర్చు చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు.
రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్,సాగునీటి ప్రాజెక్టల నిర్మాణానికి ఇప్పటి వరకు 2,16,000 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసిందని పేర్కొన్నారు. రైతు సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది తార్కాణమని అన్నారు కేసీఆర్.