అకాల వర్షాల కంటే దారుణంగా తయారయ్యారు తెలంగాణలో కొందరు ప్రభుత్వ అధికారులు. ప్రకృతి ప్రకోపానికి పంటలు కొంత దెబ్బతింటాయేమోగానీ.. వారి దోపిడికి మాత్రం అంతా, ఇంతా అన్న లెక్కలే లేకుండాపోతున్నాయి. ఆరుగాలం శ్రమించి, అనేకానేక కష్టనష్టాలకు ఓర్చి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే.. కొందరు అక్రమార్కులు అన్నదాతలను అడ్డంగా దోచుకుంటున్నారు. తరుగు పేరుతో.. దళారుల కంటే దారుణంగా ముంచేస్తున్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో తరుగు గురించి మాట మాత్రమైనా చెప్పకుండా.. నీటుగా చీటింగ్ చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల ప్రతినిధులు , మిల్లర్లు కుమ్మక్కై రైతులను ఎంత దారుణంగా మోసం చేశారో తాజాగా భూపాలపల్లి, నిర్మల్ జిల్లాల్లో వెలుగుచూసింది. తరుగు తీస్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం చెప్పడంతో.. అక్రమార్కులు మరో రూట్‌లో దోచుకున్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో చెప్పకుండా తరుగు తీస్తున్న విషయాన్ని దాచిపెట్టి… అలా తీసిన ధాన్యాన్ని ఇతరుల పేర్లతో విక్రయించారు. ఇందుకు మిల్లరు కూడా సహకరించారు. తీరా ధాన్యం డబ్బు బ్యాంకులో జమ అయిన తర్వాత.. తమకు వచ్చిన డబ్బులను చూసి రైతులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. తాము అనుకున్నవాటి కంటే తక్కువ నగదు రావడంతో షాక్ తిన్నారు. లెక్కవేసి చూస్తే.. ఒక్కో రైతు నుంచి క్వింటాలుకు 5 నుంచి 10 కిలోల ధాన్యాన్ని తరుగు పేరుతో తినేశారు.
మరోవైపు అధికారుల మోసాన్ని తట్టుకోక నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామంలో పీఏసీఏస్ అధికారులను నిర్బంధించారు రైతులు. వరి కొనుగోళ్లలో రూ. 20 లక్షల వరకు వారు అవకతవకలకు పాల్పిడినట్టుగా రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులను తీసుకువెళ్లేందుకు వచ్చిన పోలీసులను అడ్డుకుని నిరసన తెలిపారు. తమకు న్యాయం చేశాకే కదలాలని తేల్చి చెబుతున్నారు. అటు భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండలం సూరారంలోనూ రైతులు ఆందోళనకు దిగారు. తరుగు అక్రమాలకు బాధ్యులెవరో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.