కరీంనగర్ లో టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. కేజీ 3 నుంచి 4 రూపాయలు మాత్రమే పలకడంతో బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన పడుతున్నారు. కనీసం రవాణా ఖర్చులు, కూలీ పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు దిగులుపడుతున్నారు. ధరలు పడిపోతున్నా.. ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆగ్రహించారు.
మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇవ్వడమే కానీ.. ఆచరణ మాత్రం శూన్యమంటున్నారు. రవాణా ఖర్చులు కూడా రాక అవస్థలు పడుతున్నామని ఆవేదన చెందారు. తక్షణమే మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. టన్నులకొద్దీ టమాటాలు పంట పొలాల్లోనే కుళ్ళిపోతున్నాయి. లేదా చెత్తకుప్పలుగా మారుతున్నాయి.
రైతన్న కష్టం చిల్లిగవ్వకు కొరగాని పరిస్థితి ఏర్పడింది. కొద్దిరోజులుగా మార్కెట్‌కు సరుకు ఓ మోస్తారుగా వస్తున్నా.. రేటు పలకడం లేదు. వ్యాపారస్తులు.. దళారులు కుమ్మక్కై రేటు రాకుండా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వమే చొరవ చూపి రైతులను ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు.
సరైనా ధర లేకపోవడంతో టమాటాలను పశువులకు మేతగా వేస్తున్నారు. కూలీ రేట్ కూడా రాకపోవడంతో కొందరు రైతులు టమాట తెంపాలంటేనే భయపడుతున్నారు. ఆరుగాలం కష్టించి.. పండించిన పంటలకు గిట్టుబాటు లేక రైతులు విలవిలలాడుతున్నారు. టమాటా సాగు చేసిన రైతులందరిదీ ఇదే దుస్థితి.
ఏ రైతును కదలించినా.. సరైన ధర కల్పించడం లేదని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.. సాగుచేసిన టమాటా పంట రోడ్డు పాలైంది. కాలం కలిసి రావడంతో కొంత మేరకు ఆశించిన దిగుబడులు వచ్చాయనుకుంటే, ధర తగ్గిపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు రైతులు.