తెలంగాణ రాష్ట్రంలో రైతుల నిరసనలు మిన్నంటాయి. అకాల వర్షాలతో నష్టపోయిన పంటకు పరిహారం రాక రైతులు నానా తిప్పలు పడుతున్నారు. అందులోనూ ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో వడ్లు సకాలంలో కాంటాలు పెట్టడం లేదు. మరికొన్ని చోట్ల వడ్లను సరైన విధంగా జోకుతలేరని రైతులు మండిపడుతున్నారు.
ప్రకృతి శాపం వలన నష్టపోయామని, మళ్ళీ ప్రభుత్వం రైతులను ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందంటూ వాపోతున్నారు. దీంతో రైతులు ఆందోళన బాట పడుతున్నారు. ఈ బాధలు భరించలేక కొందరు రైతులు వడ్లను కల్లాల్లోనే ప్రైవేట్ వ్యాపారులకే అమ్ముకుంటున్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళనలు, నిరసనలకు దిగుతున్నారు.
తాజాగా జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని విస్నూర్ గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిరసన చేపట్టారు. దాదాపు రెండు నెలలు గడిచినా ఇప్పటికీ కాంటాలు వేయడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
వడ్ల బస్తాలను తరలించకపోవడంతో రోడ్డుపై బైఠాయించి.. నిరసన తెలిపారు. వడ్ల బస్తాలను తగలబెట్టి ఆందోళన చేశారు. లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం బస్తాలు ఉండిపోతున్నాయని, అధికారులు, నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు రైతులు.