నారాయణపేట జిల్లా మరికల్ మండల శివారులోని 449 సర్వేనెంబర్‌లో గల భూములను ఆర్డివో రాంచందర్ నాయక్ పరిశీలించారు. విషయం తెలుసుకున్న రైతులు సంఘటన స్థలానికి చేరుకొని అధికారులను అడ్డుకున్నారు. గత 40 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 449 సర్వేనెంబర్‌లో గల భూమిని మరికల్ గ్రామానికి చెందిన 70 మంది నిరుపేద కుటుంబాలకు భూ పంపిణీ చేయడం జరిగింది.
గత సంవత్సరం ఆ భూమిని మరికల్ మండల అభివృద్ధిలో భాగంగా.. మండలంలో ఏర్పాటు చేయబోయే కస్తూర్బా పాఠశాలతో పాటు.. పలు ప్రభుత్వ కార్యాలయాలకు ఇదే సర్వే నెంబర్‌లోని భూమిని అధికారులు కేటాయించారు. దానికి వ్యతిరేకంగా లబ్ధిదారులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అయినప్పటికి.. ఎలాంటి ఫలితం లేకపోవడంతో రైతులు హైకోర్టును, బీసీ కమిషన్ ను ఆశ్రయించారు.
ఈ కేసును పరిశీలించిన హైకోర్టు.. ఆ భూమి దగ్గరకు ఎవరు వెళ్లకూడదని.. ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని తమకు అనుగుణంగా స్టే ఇచ్చిందంటున్నారు రైతులు. కోర్టు ఉత్తర్వులను అధిగమించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నారాయణపేట ఆర్డిఓ వెంకటేశ్వర్లు, స్థానిక తహసీల్దార్ రమేష్, సర్వే అధికారులతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ టెక్స్టైల్ కంపెనీ యజమానితో కలిసి స్థలాన్ని పరిశీలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటున్నారు.
కోర్టు పరిధిలో ఉన్న స్థలాన్ని ఎలా పరిశీలిస్తారని అధికారులను నిలదీశారు. దీంతో రైతులకు అధికారులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. రైతుల భూముల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు రైతులు.