కేసీఆర్ సర్కార్ ఏమో వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామని దేశం మొత్తం ప్రచారం చేసుకుంటుంటే.. ఇక్కడ సీన్ మాత్రం భిన్నంగా ఉంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో..ఎప్పుడు పోతుందో..వచ్చినప్పుడు ఎంత నాణ్యత ఉంటుందో తెలియక అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండిస్తున్న పంటలు కరెంట్ కష్టాలకు బలవుతున్నాయని.. నాణ్యత లోపం కారణంగా మోటార్లు కాలిపోతున్నాయని లబోదిబోమంటున్నారు రైతన్నలు. ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడం నిరసన బాట పట్టారు.
మొన్న విద్యుత్ బిల్లుల కోసం వచ్చిన అధికారులను నిర్భందించి నిరసనను తెలియజేస్తే.. ఇప్పుడు ధర్మారం రైతులు ధర్నాకు దిగారు. నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ధర్మారం గ్రామ రైతులు సబ్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం మాటలు నీటి మూటలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక పొలాల వద్దే పడిగాపులు పడుతున్నామని అన్నదాతలు మండిపడతున్నారు. వోల్టేజ్ హెచ్చుతగ్గులతో మోటార్లు కాలిపోతుంటే వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పై నుంచి ఆదేశాలంటూ సక్రమంగా కరెంట్ ఇవ్వక పోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని పేర్కొన్నారు.
ఖచ్చితమైన హామీ ప్రభుత్వం నుంచి లభిస్తేనే ధర్నా విరమిస్తామని,వట్టి మాటలు నమ్మి మా పంటలను,బతుకులను పణంగా పెట్టబోమని హెచ్చరించారు. నాణ్యమైన కరెంట్ 24 గంటలు అందించేలా తక్షణం చర్యలు చేప్టటాలని డిమాండ్ చేస్తున్నారు. గంటకు పైగా ధర్నా కొనసాగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.