రాష్ట్రంలోని రైతులు సీఎం కేసీఆర్ మాటలను గిరిదాటకుండా సూచా తప్పకుండా పాటిస్తున్నారు. అందుకు నిదర్శనం ఓ రైతు పెట్టిన ఈ ప్లెక్సీ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాష్ట్రంలో పలు చోట్ల భూసేకరణ పేరుతో అధికారులు రావడం.. వారిని రైతులు అడ్డుకోవడం సహజంగా జరుగుతున్నాయి. దీంతో పోలీసులు వచ్చి కేసులు పెట్టడం వంటివి జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో కొందరు రైతులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. తమ పంట పొలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన రైతులు కొంతమంది ఈ వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
తమ భూముల్లోకి అనుమతి లేకుండా సర్వే చేసేందుకు అధికారులు కానీ.. సర్వేయర్లు కానీ వస్తే.. కేసీఆర్ దొర చెప్పినట్టు బడితే పట్టి జోపుడు కార్యక్రమం జరుపబడును అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఉన్న కొద్దిపాటి భూమిని మూడో టీఎంసీ పనుల కోసం అప్పగిస్తే తాము బ్రతకడం ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
పరిహారం కూడా బొటాబొటిగా ఇస్తామని అంటున్నారు. ఉన్న కొద్దిపాటి భూమిని భూసేకరణ పేరుతో ఆక్రమిస్తే తమ కుటుంబాలతో రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. ప్రభుత్వం తీసుకున్న మూడో టీఎంసీ పనులను నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.