నిజామాబాద్ జిల్లాలో కాళేశ్వరం ప్యాకేజీ 21, 22 పనులను నిలిపివేయాలని కోరుతూ ముంపు గ్రామాల ప్రజలు, రైతులు మళ్లీ నిరసన చేపట్టారు. శుక్రవారం మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలో కొండెం చెరువు వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను నిలిపివేయాలని క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. గురువారం 9 గ్రామాలకు చెందిన ప్రజలు, రైతులు క్యాంపు కార్యాలయం ముట్టడికి వస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మంచిప్ప గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
స్టేషన్ కు తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. రైతుల నిరసనకు ప్రజా సంఘాలు కూడా మద్దతు పలికాయి. గతంలో కూడా ప్రజల వ్యతిరేకతతో ప్రాజెక్టు పనులను అధికారులు నిలిపివేశారు. ఇటీవల తిరిగి ప్రారంభించే దిశగా పనులు చేస్తుండడంపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు ప్రాణహిత చేవుళ్ల అంబేద్కర్ సుజల స్రవంతి ప్యాకేజ్ 21, 22లో భాగంగా కొండెం చెరువు రిజర్వాయర్ ను 1.5 టీఎంసీ నిర్మించేందుకు ప్రణాళికలు ఉన్నాయి.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం కాళేశ్వరం ప్యాకేజీ 21, 22 పేరుతో 3.5 టీఎంసీల సామర్థ్యంతో రీ డిజైన్ పనులు చేపట్టడాన్ని ముంపు గ్రామాలకు చెందిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ రీ డిజైన్ కారణంగా 3 తండాలు, 1200 ఎకరాల వ్యవసాయ భూమి, 800 ఎకరాల అటవీ భూమి, 12 వేల కుటుంబాలు నిరాశ్రయులమవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.