– బొమ్మరాస్ పేట్ రైతుల అవస్థలు
– కలెక్టరేట్ ముందు ధర్నా
– ధరణి వచ్చాక భూములు కోల్పోయామంటూ ఆవేదన
– కబ్జాదారుల వెనుక మంత్రి ఉన్నారని ఆరోపణ
మేడ్చల్ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శామీర్ పేట్ మండల పరిధిలోని బొమ్మరాస్ పేట్ గ్రామానికి చెందిన 200 మంది రైతులు ధర్నాకు దిగారు. దీంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామ పరిధిలో 1050 ఎకరాల భూమిని రైతులు సాగు చేసుకుంటున్నారు. అయితే.. ఈ భూములపై కబ్జాదారుల కన్నుపడిందని అంటున్నారు బాధితులు. నకిలీ పత్రాలతో భూములు కాజేసే కుట్ర చేస్తున్నారని వాపోతున్నారు. 1050 ఎకరాలపై కోర్టులో కేసులు ఉండడంతో సర్వే నెంబర్లను పూర్తిగా బ్లాక్ చేశారు అధికారులు.
రైతులు ఎన్నో ఏళ్లుగా పట్టా పాస్ పుస్తకాలు కలిగి ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు కూడా అందుతోంది. అయితే.. ధరణి వీరికి శాపంగా మారింది. నకిలీ డాక్యుమెంట్లతో కోర్టుల్లో కేసులు వేసి తమను కబ్జాదారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంటున్నారు రైతులు. పైగా రెవెన్యూ అధికారులు నకిలీ డాక్యుమెంట్లతో తమ భూములను కబ్జాదారులకు కట్టబెట్టారని చెబుతున్నారు.
అధికారులను సర్వే నెంబర్లను బ్లాక్ చేయండంతో రైతున్నలు భూములు అమ్ముకునే వెసులుబాటును కోల్పోయారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కకపోవడంతో కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. ధరణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ భూ కబ్జా రూ.1500 కోట్ల కుంభకోణంగా చెబుతున్నారు రైతులు. దీని వెనుక మంత్రి జగదీష్ రెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తున్నారు.
Advertisements