రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ చందుర్తి మండలం మూడపల్లి వద్ద, వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కలెక్టర్ రావాలంటూ రోడ్డుపై బైఠాయించి.. నిరసన వ్యక్తం చేశారు రైతులు. ఇప్పటికే ప్రకృతి శాపం వలన నష్టపోయామని, మళ్ళీ ప్రభుత్వం రైతులను ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందంటూ వాపోయారు.
మరోవైపు బోయిన్పల్లి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు వెంటనే చేయాలని రైతులు బోయిన్పల్లి చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. అధికారులు లారీల కొరత సాకు పేరుతో వారం రోజులుగా ధాన్యం కొనుగోలు నిలిపివేశారని, తరుగు పేరిట ఐదు కిలోలు కట్ చేస్తున్నారని ఆరోపించారు.
ఇక జగిత్యాల జిల్లాలో వెల్గటూర్ బీఆర్ఎస్ నేత, పీఎసీఎస్ చైర్మన్ గోలి రత్నాకర్ ఇంటిముందు ఆందోళనకు దిగారు మొక్కట్రావ్ పేట్ గ్రామ రైతులు. ధాన్యం కొనుగోలు నిలిపివేశారని చైర్మన్ ని నిలదీశారు. సుమారు రెండు గంటల పాటు చైర్మన్ తో రైతులు వాగ్వాదానికి దిగారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.
లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం బస్తాలు ఉండిపోతున్నాయని రైతులు వాపోయారు. అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అయితే చైర్మన్ వెంటనే సివిల్ సప్లై అధికారులకు ఫోన్ చేసి.. ఆగ్రహం వ్యక్తం చేశారు.