పండిన పంటకు ధర లేదు.. మార్కెట్ లో దళారుల మోసం.. అటు చూస్తే అప్పుల బాధలు.. ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్యే శరణ్యమని భావిస్తున్నాడు మిర్చి రైతు. ఇప్పటికే రాష్ట్రంలో చాలామంది సూసైడ్ చేసుకున్నారు. అయినా కూడా మార్కెట్లలో పరిస్థితి ఏమాత్రం మార్పు లేదు.
వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో రైతులు నిరసనకు దిగారు. మిర్చి ధర రోజురోజుకీ తగ్గిపోతుండడంతో ఆఫీస్ ను ముట్టడించారు. వ్యాపారులు కావాలనే ధరలను నియంత్రిస్తున్నారని ఆరోపించారు. సీజన్ ప్రారంభంలో రూ.18,600 పలికిన ధర.. ఇప్పుడు రూ.17,000కు పడిపోవడంపై మండిపడుతున్నారు రైతులు.
ఉత్తర తెలంగాణలోని దాదాపు ఏడెనిమిది జిల్లాల నుంచి మిర్చిని అమ్మేందుకు తీసుకొచ్చారు రైతులు. వారంతా మార్కెట్ లో ఆందోళనకు దిగారు. పాలక వర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్టుబడులు గతంతో పోలిస్తే ఇప్పుడు రెండింతలు అయ్యాయని వాపోతున్నారు రైతులు.
రైతుల నిరసన చేస్తున్న విషయం తెలిసి పోలీసులు అక్కడికి చేరుకుని వారిని శాతింపజేసే ప్రయత్నం చేశారు. అయితే మార్కెట్ చైర్ పర్సన్ వచ్చి తమకు న్యాయం చేసేంత వరకు ధర్నాను ఆపబోమని తేల్చిచెప్పారు రైతులు.