దశాబ్దాలుగా వాడకంలో ఉన్న భూములు ఆన్ లైన్ కాక రైతులు అవస్థలు పడుతున్నారు. సమస్య పరిష్కరించాలని ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ రైతులు ఆరు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందంటూ రైతులు ఆందోళనకు దిగారు.
తాము సాగు చేసుకుంటున్న భూములకు కొర్రీలు పెడుతూ గత రెండేళ్లుగా అధికారులు అటవీ భూములుగా పేర్కొంటున్నారని రైతులు నిరసన వ్యక్తం చేశారు. అధికారులు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ తహశీల్దార్ కార్యాలయం ముట్టడికి వెళ్తున్న రైతులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.
రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం కాస్త.. తోపులాటకు దారి తీయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ అధికారులతో సమావేశం ఏర్పరుస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
నారాయణపురం గ్రామానికి వచ్చిన రెవెన్యూ అధికారులతో రైతులు తమ సమస్యలు చెప్పుకోవడంతో.. 15 రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు.