అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అన్నం పెట్టే రైతన్నకే అన్యాయం చేస్తున్నారు. మహబూబాబాద్ లోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో ఈదులపూసపల్లి, వేమునూరు, లక్ష్మిపురం, రెడ్యాల గ్రామాలకు చెందిన రైతులు.. ఖరీఫ్ సాగు కోసం 1001 రకం వరి విత్తనాలు తీసుకున్నారు. వాటిని పొలాల్లో వేసి సాగు చేశారు. అయితే అనుకున్న సమయం కంటే ముందే వెన్ను వచ్చేసింది. ఇంత త్వరగా పంట ఎదగడం ఏంటని డౌట్ వచ్చి.. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నిర్వాహకుడు మోహన్ ను నిలదీశారు రైతులు. అతను సరైన సమాధానాలు చెప్పలేదు.
తమకు న్యాయం చేయాలంటూ రైతులు షాపు ముందు ధర్నాకు దిగారు. ఆరోజు కొనుగోలు చేసిన విత్తనాల బ్యాగులతో నిరసన చేపట్టారు. చివరకు పంచాయితీ అధికారుల దగ్గరకు వెళ్లింది. ఏవో తిరుపతిరెడ్డి రైతుల నుంచి వివరాలు సేకరించి.. విత్తనాలు మార్చి ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామని నష్ట పరిహారం ఇచ్చేలా చూస్తామని చెప్పారు.
అయితే.. షాపు యజమాని గూడూర్ మండలంలోని గోవిందపూర్ గ్రామ సర్పంచ్. అధికార టీఆర్ఎస్ పార్టీ నేత. దీంతో తమకు న్యాయం జరుగుతుందో.. లేదోనని లబోదిబోమంటున్నారు రైతులు. టీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ విషయంలో కలగజేసుకుని తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముందుగా పంట వస్తే దిగుబడి తక్కువ వస్తుందని చెబుతున్నారు రైతులు.