నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఏడోసారి కూడా.. రైతులతో జరిపిన చర్చల్లో సమస్య కొలిక్కి రాలేదు. ఎవరికి వారు పట్టువీడకపోవడంతో అసంపూర్తిగానే ముగిశాయి. దీంతో మరోసారి సమావేశం కావాలని రైతు సంఘాలు, కేంద్రం నిర్ణయించాయి. జనవరి 8న మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ చర్చలు జరగనున్నాయి.
సాగు చట్టాల రద్దు, ఎమ్మెస్పీకి చట్టబద్దతను రైతు సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే కేంద్రం మాత్రం అవసరమైతే కోరిన సవరణలను చేస్తామే తప్ప.. చట్టాలను వెనక్కి తీసుకోమని చెబుతోంది. అందుకు రైతు సంఘాలు ససేమీరా అంటున్నాయి. మొత్తం చట్టాలనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. చట్టాల ఉపసంహరణ అంశం కాకుండా మరే అంశంపై చర్చను తాము కోరుకోవడం లేదని చెబుతున్నాయి. దానిపై ప్రకటన వచ్చే వరకూ ఆందోళన కొనసాగుతుందని తేల్చి చెప్పాయి.