దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టేందుకు రెండు రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న అన్నదాతలు ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. ఢిల్లీలో నిరసన తెలిపేందుకు వారికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు నిరసనగా ‘ఛలో ఢిల్లీ’ చేపట్టారు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రైతులు. అయితే శాంతి భద్రతల పేరుతో వారికి ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో రోడ్లు మూసివేసి వారిని రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారిపై లాఠిచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. కానీ రైతులు వెనుకడుగు వేయలేదు. ఎన్ని రకాలుగా వారిని తిప్పి పంపే ప్రయత్నం చేసినా.. పోరాటానికే సిద్ధమయ్యారు.
ముఖ్యంగా హర్యానా, ఢిల్లీ సరిహద్దులో అయితే పరిస్థితిరి రణరంగాన్ని తలపించింది. రైతులను ఢిల్లీలోకి రానివ్వకుండా అన్ని దారుల్లో పెద్ద పెద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీ వాహనాలను అడ్డుగా పెట్టారు. ఇసుకు నింపిన బస్తాలను రోడ్డుకు అడ్డంగా వేశారు. కానీ అవేవీ రైతుల పోరాటం ముందు నిలవలేదు. ఈ క్రమంలో హర్యానా, పంజాబ్ ముఖ్యమంత్రులు మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగింది.
తమను ఢిల్లీలోకి అనుమతినివ్వాలని రైతులు చివరికి ప్రధానికి లేఖ కూడా రాశారు. కానీ పోలీసులు మాత్రం వారిని వదిలిపెట్టేందుకు నిరాకరించారు. రెండు రోజులుగా దేశమంతా ఇదే వ్యవహారంపై చర్చ జరగుతుండటం, పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో చివరికి వారు వెనక్కి తగ్గారు. |హస్తినలోకి అడుగు పెట్టేందుకు అనుమతించారు.