ఢిల్లీలో రైతుల ఆందోళన ఎన్డీయేకు ప్రస్తుతం తలనొప్పిగానే కాదు.. రానున్న రోజుల్లో ఎన్నికల సవాలుగా కూడా మారబోతోంది. కొత్త వ్యవసాయ చట్టాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాష్ట్రాల్లో ఏడింటిలో వచ్చే ఏడాదిన్నర కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అవి కూడా ఎన్డీయే అత్యంత ప్రతిష్టాత్మకమైన భావించే అస్సాం, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కావడం ఆ పార్టీలో కొంత ఆందోళన కలిగిస్తోంది.
గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఏడు రాష్ట్రాల్లోని 213 నియోజకవర్గాల్లో బీజేపీ ఏకంగా 96 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఈ మూడు వ్యవసాయ చట్టాలను పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందులో బీజేపీకి సపోర్ట్ చేసే పార్టీలు కూడా ఉండటం గమనార్హం. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడులలో బీజేపీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ సమయంలో బీజేపీ మూడు చట్టాలపై మొండిగానే ఉంటుందా.. లేక విపక్షాల కోరిన మార్పులకు సిద్దమవుతుదా అనేది ఆసక్తి రేపుతోంది.