మాస్టర్ ప్లాన్ విషయంలో ఇటు కామారెడ్డి, అటు జగిత్యాల వాసులు భగ్గుమంటున్నారు. పండుగ పూట కూడా తమ నిరసనను వ్యక్తం చేశారు. సంక్రాంతి సందర్భంగా శనివారం నుంచి ముగ్గులతో నిరసన తెలుపుతున్నారు కామారెడ్డి రైతులు. మాస్టర్ ప్లాన్ రద్దు చేసి తమ భూముల్ని కాపాడాలంటూ కుటుంబ సమేతంగా రోడ్లపైకి వచ్చి ముగ్గులు వేస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం సంక్రాంతి సందర్భంగా ఇళ్లలో గడపాల్సిన రైతు కుటుంబాలు గాంధీ గంజ్, సిరిసిల్ల రోడ్ తదితర ప్రాంతాల్లో మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని ముగ్గులు వేశారు. తాము కూడా మీలాగే కుటుంబ సభ్యులతో ఇళ్లలో పండుగ వేడుకల్ని జరుపుకొనివ్వండి అంటూ నిరసన తెలిపారు. తమ జీవనాధారమైన సాగు భూముల్ని పరిశ్రమలు, రోడ్ల పేరిట లాక్కొని తమ జీవితాల్ని ఆగం చేయొద్దంటూ వేడుకున్నారు.
మరోవైపు జగిత్యాల టౌన్ మాస్టర్ ప్లాన్ పైనా రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. పండుగ పూట కూడా రైతులు నిరసన తెలియజేశారు. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామ ప్రజలు మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలంటూ పంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ నిరసనలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు.
భోగి రోజున మోతె, తిమ్మాపూర్, నర్సింగాపూర్ గ్రామాల్లో చాలామంది రైతులు ముగ్గులు వేసి స్టాప్ రిక్రియేషన్ జోన్, స్టాప్ మాస్టర్ ప్లాన్, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీలు రాజీనామా చేయాలని ఆందోళన చేశారు. మాస్టర్ ప్లాన్ నుంచి తమ భూములను తొలగించకపోతే మరో ఉద్యమం తప్పదంటూ హెచ్చరించారు. మాస్టర్ ప్లాన్స్ ను వ్యతిరేకిస్తూ రెండు ప్రాంతాల్లో రైతన్నలు పండుగ పూట రోడ్డుపైనే ఉన్నారు.