అధికార పార్టీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ధాన్యం కొనుగోలు విషయమై ఎమ్మెల్యేను రైతులు నిలదీశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అనుచరులు, అన్నదాతల మధ్య వాగ్వాదం జరిగింది.
వరికోతలు ముగిసి నెల రోజులు దాటుతున్నా వడ్లు ఇంకా కల్లాల్లోనే ఉన్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాసినా అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
ధాన్యం కొనుగోలు చేస్తామని సర్కార్ చెప్పినా అధికారులు కొనుగోలు చేయడం లేదని వివరిస్తున్నారు. ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయిని రైతులు నిలదీశారు. రోడ్డుపై ధర్నా చేసి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
అధికారులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు చేసేలా చూస్తానని రసమయి హామీ ఇచ్చారు. అయినా ఎమ్మెల్యేను రైతులు వదలలేదు. నెల రోజులకు పైగా కొనుగోలు కేంద్రాల్లో తాము ఇబ్బందులు పడుతున్నామని, అకాల వర్షంతో నష్టం వాటిల్లుతున్నదని రైతులు తెలిపారు.