సన్న వడ్లు పెట్టిమంటివి … ఇప్పుడేమో కొనటం లేదంటూ తెలంగాణలో రైతన్నలు సీఎం కేసీఆర్ పై ఆవేదనతో మండిపడ్డ ఘటనలు అనేకం. యావత్ తెలంగాణ వ్యాప్తంగా మక్కలు కొనాలని, సన్నరకం వడ్లు కొనాలని, తరుగు పేరుతో వేధించొద్దంటూ రైతులు అధికార పార్టీ నేతల కాళ్లావేళ్లా పడ్డ కనికరించలేదు. ఇంకా చాలా చోట్ల వడ్లు కళ్లాల్లోనే ఉన్నాయి. ఇంతలో గ్రేటర్ ఎన్నికలు రావటంతో సన్నాలు వేసిన రైతుల కష్టాలు పట్టించుకునే వాడే లేకుండా పోయారు.
కానీ గ్రేటర్ ఎన్నికల ఓటమి తర్వాత బీజేపీపై రగిలిపోతున్న టీఆర్ఎస్ పార్టీకి రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ మంచి అవకాశంగా కనపడినట్లుంది. వెంటనే రైతుల కోసం మేము కూడా మద్ధతిస్తున్నాం, టీఆర్ఎస్ నేతలంతా బంద్ విజయవంతం చేయాలని కేసీఆర్, కేటీఆర్ పిలుపునిచ్చారు. దీంతో నేతలంతా చాలా రోజుల తర్వాత ధర్నాల కోసం రోడ్లమీదకు వస్తున్నారు.
మీరేం న్యాయం చేశారని… ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ జనం టీఆర్ఎస్ నేతలపై తిరగబడుతున్నారు. అసలు మీకు రైతుల కోసం ధర్నా చేసే హక్కుందా…? అని నిలదీస్తున్నారు. సన్నాలు కొనాలని ధర్నా చేస్తున్న తమను అరెస్టు చేశారని… ఇప్పుడు మళ్లీ మీరే వచ్చారా అని ప్రశ్నించారు. ఇటు ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి కూడా ఇలాంటి చేధు అనుభవమే ఎదురయ్యింది. ఇన్నాళ్లు కనపడని రైతు కష్టాలు ఇప్పుడే వచ్చాయా అని నిలదీసిన ఓ మహిళ.. తమకు ఇబ్బందులకు గురి చేసి బారికేడ్లు పెట్టడం ఏంటని నిలదీసింది. కరీంనగర్ సహా పలు ప్రాంతాల్లోనూ ఇవే సంఘటనలు దర్శనమిచ్చాయి.