కేంద్ర ప్రభుత్వంతో మరోసారి చర్చలకు రైతు సంఘాలు ఓకే చెప్పాయి. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు కేంద్రంతో చర్చలు జరిపేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు ప్రకటించాయి. ప్రభుత్వంతో చర్చలకు తాము ఎప్పుడూ సిద్దంగానే ఉన్నామని స్పష్టం చేశాయి. చర్చలకు సంబంధించి అజెండాలో ఉండాల్సిన మొదటి రెండు అంశాలను కూడా రైతు సంఘాలు ప్రభుత్వానికి గుర్తు చేశాయి. ఒకటి కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకునేందుకు చేపట్టే చర్యలు కాగా.. రెండోది కనీస మద్దతు ధరకు సంబంధించి చట్టబద్ధత కల్పించాలని కోరాయి. వీటితో పాటు విద్యుత్ బిల్లు2020 ముసాయిదాలో మార్పులపై కూడా చర్చకు అంగీకారం తెలిపాయి.
మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో నేటితో 31 రోజులుగా రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. చలి తీవ్రత పెరుగుతున్నా లెక్క చేయకుండా నిరసనను తెలియజేస్తున్నారు. విపక్షాలకు సంబంధించిన రెండు, మూడు పార్టీలు మినహా దాదాపు అన్ని రాజకీయ పక్షాలు రైతులకు తమ మద్దతును తెలియజేశాయి. ఇప్పటికే రైతులతో కేంద్రం చర్చలు జరిపినప్పటికీ.. సఫలం కాలేదు. దీంతో మంగళవారం జరిగే చర్చలో ఏం తేలనుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.