కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నాలుగు నెలలుగా ఉద్యమిస్తూ..వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేసిన రైతులు ఇక కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దమవుతున్నారు. మే నెలలో చలో పార్లమెంట్‌కు పిలుపునిచ్చింది సంయుక్త కిసాన్ మోర్చా. ర్యాలీ తేదీని త్వరలోనే నిర్ణయిస్తామని ప్రకటించింది. ఇక ఏప్రిల్ 10న కుండ్లి-మనేసర్-పాల్వాల్ ఎక్స్‌ప్రెస్ హైవేను దిగ్బంధం చేయనున్నట్టు తెలిపింది.
జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి.. చారిత్రాక ఎర్రకోటను కూడా ముట్టడించి ఉద్యమ తీవ్రతను కేంద్రానికి చూపించారు రైతులు. రెండుసార్లు దేశవ్యాప్త బంద్ కూడా చేపట్టారు. కానీ ఈ సమస్యను పరిష్కరించే ఆలోచనలో కేంద్రం కనిపించడం లేదు. మరోవైపు వివాదాస్పద చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ తాజాగా తమ రిపోర్ట్‌ను అందజేయడంతో.. ఎలాంటి తీర్పువస్తుందో తెలియనందు.. ఇప్పటి నుంచే నిరసనలను తీవ్రం చేసేందుకు సంయుక్త కిసాన్ మోర్చా సిద్దమవుతోంది.