విజయవాడ : ‘అమరావతి’ ఉంటుందా..? ఉండదా..? అసలు క్యాపిటలే ఇక్కడి నుంచి తరలిపోతుందా..? రాజధాని గ్రామాల రైతులకు ఇదే టెన్షన్. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేసినప్పటి నుంచి రాజధాని గ్రామాల రైతుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.
ఆధునిక ప్రపంచ అద్భుత అవకాశాల గనిగా అందరినీ ఆకర్షించిన అమరావతి నిర్మాణానికి వినూత్న భూ సమీకరణ విధానంలో రైతులు పైసా తీసుకోకుండా 30 వేల ఎకరాలకు పైగా భూమిని ఇచ్చారు. చంద్రబాబుపై భరోసాతోనే వారు విలువైన తమ భూముల్ని ధారాదత్తం చేశారు. చంద్రబాబు తమ ప్రాంతానికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చి ఇక్కడొక విశ్వనగరిని నిర్మిస్తారని వారి ధీమా. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అమరావతి సీన్ రివర్స్ అయింది. సీఎం నోట ‘అమరావతి’ అనే మాటే ఇంతవరకూ రాలేదు. అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అసలు చంద్రబాబు కట్టించిన వెలగపూడి సచివాలయంలో అడుగు కూడా పెట్టరాదని జగన్ భీష్మించుకున్నట్టు.. తనకు బాగా దగ్గరైన అధికారులు కొందరు నచ్చచెప్పడంతో తప్పనిసరిగా అక్కడ తన కార్యాలయం కొనసాగించడానికి అంగీకరించారని మొదట్లో అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి అనేది వుంటుందని ఎక్కువమంది అయితే అనుకోవడం లేదు. అది భ్రమరావతిగానే మిగిలిపోతుందని పలువురి భావన.
అగ్నికి ఆజ్యం పోసినట్లు జనం సందేహాలకు సత్తిబాబు ప్రకటన తోడైంది. రాజధాని గ్రామాల్లో ప్రస్తుతం ఎటు చూసినా నిరాశ, నిస్పృహ కనిపిస్తోంది. సాధారణ నిర్మాణాల కంటే వ్యయం అమరావతిలో ఎక్కువగా ఉందని, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని, ముంపు ప్రాంతాలున్నాయని బొత్స చేసిన ప్రకటన అమరావతి నిర్మాణం అంత సులువు కాదనే అభిప్రాయం చెప్పకనే చెప్పినట్టయింది. సందట్లో సడేమియాలా మాజీ ఎంపీ చింతా మోహన్ ఓ కొత్త వాదన మొదలుపెట్టారు. రాజధాని ఏర్పాటుకు తిరుపతి నగరం అత్యంత అనుకూలమని, ఇక్కడే కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని చింతా డిమాండ్. మరికొందరు విశాఖ నగరం రెడీమేడ్ ఇల్లులాంటిదని, చంద్రబాబు అప్పుడే విశాఖను రాజధానిగా ప్రకటించివుంటే బావుండేదని కొత్త పల్లవి అందుకున్నారు. హుద్‌హుద్ తుఫాన్ తరువాత విశాఖ శాఖోపశాకగా ఎదిగి విశ్వనగరంగా మారిందని వారి అభిప్రాయం. ఇవన్నీ విన్నాక ఇక రాజధాని రైతులు అమరావతిపై మరింత ఆందోళనతో ఉన్నారు. వీరు అడిగే ప్రశ్నలకు సీఆర్‌డీఏ అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆందోళన అవసరం లేదని అధికారులు తాత్కాలికంగా వారికి సర్దిచెప్పినా రాజధాని రైతులు కుదుటపడటంలేదు.
రాజధాని పరిధిలోని గ్రామాల వారీగా సమాచారం పంపి రైతు ముఖ్య నేతలంతా బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరితో సమావేశానికి సన్నద్దులవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ‘సుజనా’తో రాజధాని రైతు నేతలు ఫోన్‌లో మాట్లాడి తాము వెంటనే బీజేపీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి తమ గోడు వెళ్ళబోసుకోవడానికి వారంతా ఈ ఢిల్లీ పర్యటన ఏర్పాట్లలో ఉన్నారు.
ఇలావుంటే, జగన్ ప్రభుత్వం దొనకొండకు రాజధాని తరలించే అవకాశం ఉందన్న ప్రచారం రైతుల్ని టెన్షన్ పెడుతోంది. మరోవైపు మంగళగిరి పరిసరాల్లో, నాగార్జున యూనివర్సిటీ దగ్గర కొన్ని నిర్మాణాలు చేస్తారనే మరో ప్రచారం రాజధాని రైతుల్ని మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు రావడంలేదు. స్థలం అమ్ముదామంటే కొనే దిక్కులేదు. పనులు ఎప్పుడు మొదలవుతాయో తెలీదు. అసంపూర్తి భవనాలు బోసిపోతున్నాయి. ఆశగా భూములిచ్చిన రైతుల పరిస్థితి దయనీయమైంది. అసలు రాజధాని నిర్మాణం ఇక్కడే జరుగుతుందా…? అసలే ఆగిపోతుందా? నామమాత్రపు పనులతో ఈ ఐదేళ్లు స్తబ్దుగానే ఉంచేస్తారా..? లేక నిర్మాణాలు కొనసాగిస్తారా? ప్రస్తుతం ఈ అయోమయ పరిస్థితిలో అమరావతి రైతులు తల్లడిల్లుతున్నారు.