గత కొద్ది రోజులుగా జగిత్యాల మాస్టర్ ప్లాన్ ని రద్దు చేయాలంటూ రైతులు తీవ్ర ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. వీరికి మద్దతుగా పలువురు రాజకీయ నాయకులు, కౌన్సిలర్లు నిలిచారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇంటి ముందు రైతులు బైఠాయించి ఆందోళన చేయడంతో ఆయన మాస్టర్ ప్లాన్ రద్దు చేయిస్తానని హామీ ఇచ్చారు.
గత మూడు రోజులుగా రైతుల నిరసనలతో మాస్టర్ ప్లాన్ సవరణ విషయం పై మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా కలగజేసుకోవడంతో ఎమ్మెల్యే సంజయ్ మున్సిపల్ లో రద్దు తీర్మానం చేయడం వెనువెంటనే జరిగిపోయాయి.
అసలేం జరిగిందంటే..జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు కోసం అన్నదాతలు ఆందోళనకు దిగారు. మాస్టర్ ప్లాన్ రద్దు కోసం జగిత్యాల అష్టదిగ్బంధనానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నా నిర్వహించారు. అంబారీ పేట, హుస్నాబాద్ అన్నదాతలు జగిత్యాల నిజామాబాద్ రహదారిపై బైఠాయించారు. తిమ్మాపూర్, మోతె గ్రామస్తులు సైతం జగిత్యాల పెద్దపల్లి రహదారిపై ధర్నాకు దిగారు. నడిరోడ్డుపై వంట వండుకొని రోడ్డుపైనే కూర్చుని తిన్నారు. జై జవాన్, జై కిసాన్ నినాదాలతో హోరెత్తించారు.మరోవైపు మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా మిగతా గ్రామాల్లోనూ ఆందోళనలు మిన్నంటాయి.
అన్నదాతల ఆందోళన నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. వాహనాలు బారులు తీరి ఇబ్బంది కలుగుతున్నా ప్రయాణికులు మాత్రం రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతుల డిమాండ్ మేరకు మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కోరుతున్నారు. మరో వైపు నర్సింగాపూర్ లో గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేసే వరకు నిరసనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు.
ఇక ఇలా ఉంటే జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు నిరసన సెగ తాకింది. జిల్లా కేంద్రంలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించేందుకు వెళ్తుండగా.. మార్గం మధ్యలో మంత్రిని రైతులు అడ్డుకున్నారు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలంటూ రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో చేసేదేం లేక మంత్రి వెనుదిరిగారు. మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా అష్టదిగ్బంధనానికి రైతు జేఏసీ నాయకులు పిలుపునివ్వడంతో పలు గ్రామాల రైతులు రాస్తారోకోలు చేపట్టారు. ఈ క్రమంలో మంత్రి కంటి వెలుగు కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలంటూ ఈ నెల 7 నుంచి ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.