అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన భక్తులు వరదల్లో చిక్కుకుపోయారు. కొండ పైనుంచి ఒక్కసారిగా వరదనీరు ముంచెత్తడంతో పదుల సంఖ్యలో జనం కొట్టుకుపోయారు. సరిగ్గా వరద నీరు కిందకు వచ్చే దారిలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో తీవ్ర విషాదం నెలకొంది.
ఈ ఘటనపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పలు ప్రశ్నలు సంధించారు. అమర్ నాథ్ గహ దగ్గర ఏం జరిగిందో, ఎలా జరిగిందో ప్రభుత్వం వివరిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. రిస్కీ ప్లేస్ లో టెంట్లు ఎలా వేశారో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అసలు.. ఆ ప్రాంతంలో గుడారాలను వేయడం ఇంతవరకు జరగలేదని.. ఇదే తొలిసారని అన్నారు.
ఇది బహుశా మానవ తప్పిదమే అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు అబ్దుల్లా. అమర్ నాథ్ ఘటన దురదృష్టకరమని.. వరదల్లో మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలన్నారు.
మరోవైపు ఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక బృందాలు యాత్రికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇండియన్ ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ బెటాలియన్ కశ్మీర్ లోయలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ ఘటనలో 16 మంది మృతిచెందగా.. మరో 40 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.