జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫరూఖ్ అబ్ధుల్లా నిర్బంధాన్ని ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. పబ్లిక్ సేప్టీ యాక్ట్ కింద ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీనగర్ గుప్ కార్ రోడ్డులోని ఆయన ఇంటినే ప్రభుత్వం సబ్ జైలుగా ప్రకటించడంతో ఫరూఖ్ అబ్దుల్లా తన ఇంటి నుంచి బయటకు రావడానికి వీల్లేదు.
జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినప్పటి నుంచి జమ్మూ కశ్మీర్ నేతలు ఫరూఖ్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను పోలీసులు గృహ నిర్భంధం చేశారు. పబ్లిక్ సేప్టీ యాక్ట్ కింద ఎవరైనా వ్యక్తిని ఏ విచారణ లేకుండానే రెండు నెలల వరకు నిర్బంధించే వీలుంది. సాధారణంగా టెర్రరిస్టులు, వేర్పాటువాదులు, రాళ్లు రువ్వే వారిపై ఇలాంటి చట్టాన్ని ప్రయోగిస్తారు. అయితే మూడు సార్లు ముఖ్యమంత్రి, ఎంపీ అయిన ఓ రాజకీయ నాయకుడిపై నిర్బంధం విధించడం ఇదే మొదటిసారి. కలప స్మగ్లర్లను కట్టడి చేయడానికి ఫరూఖ్ అబ్దుల్లా తండ్రి షేక్ అబ్దుల్లా 1978 లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.
ఎంపీ ఫరూఖ్ అబ్దుల్లాను నిర్బంధించడం తగదని..ఒక ఎంపీగా పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే హక్కు అతనికుందని..ఆ అవకాశం కల్పించాలని ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ సభ్యులు కోరారు. ఫరూఖ్ అబ్దుల్లా నిర్బంధంతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని..అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని..వారు ఎప్పుడు అవసరమనుకుంటే అప్పుడు నిర్బంధం ఎత్తివేస్తారని హోం మంత్రి అమిత్ షా బదులిచ్చారు.